ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ .

 


అత్యవసర వినియోగానికి కరోనా వ్యాక్సిన్‌గా ఫైజర్‌ టీకాను వినియోగించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో దేశంలో అనుమతి పొందుతూ వస్తున్న ఫైజర్ చివరికి తన సొంత గడ్డ అయిన అమెరికాలోనూ అనుమతి పొందగలిగింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) శనివారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ వ్యాక్సిన్‌ను వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు చేస్తున్న పోరాటం ఇది చారిత్రాత్మక ఘట్టం అని ఫైజర్ సంస్థ పేర్కొంది. కాగా, ఫైజర్‌ను అనుమతించిన దేశాల్లో అమెరికా ఆరవ దేశంగా గుర్తింపు పొందింది. తొలుత బ్రిటన్, బహ్రెయిన్, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో దేశాలు ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా అనుమతించడంతో ఫైజర్-బయోన్‌టెక్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 24 గంటల్లో అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతిచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘ఈ రోజు వైద్య రంగంలో అమెరికా అద్భుతాన్ని సాధించింది. రాబోయే తొమ్మిది నెలల్లో సురక్షితమై, ప్రభావంతమైన వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ పంపిణీ చేస్తాము. చరిత్రలో నమోదైన శాస్త్రీయ విజయాలలో ఇది ఒకటి. ఇది లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడటమే కాకుండా కరోనా మహమ్మారిని అంతమొందిస్తుంది. ఫైజర్ వ్యాక్సిన్ అంచనాలకు మించి పని చేస్తుంది. 95శాతానికి పైగా ప్రభావం చూపుతోంది. ఈ వ్యాక్సిన్ అమెరికన్లందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాము. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాము. 24 గంటల్లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.’ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ను ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి, వృద్దులకు ఇవ్వనున్నారు. శీతాకాలం నేపథ్యంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉన్న సమయంలో ఫైజర్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటికే 15 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ముందు ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఎఫ్‌డీఏ‌కు అమెరికా ప్రభుత్వ అడ్వైజరీ ప్యానల్ సిరఫారసు చేసింది. ఈ సిఫారసును పరిశీలించిన ఎఫ్‌డీఏ అనుబంధ విఆర్‌బిపిఎసి(వ్యాక్సిన్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వైజరీ కమిటీ) 17-4 ఓట్లతో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపింది.