టిఆర్ఎస్ ప్రభుత్వానికి రెండేళ్ళు పూర్తి.

 


టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఈరోజుతో సరిగ్గా రెండేళ్లు అయింది. తొలి విడత నాలుగున్నరేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ జల్లులో తడిసి ముద్దయిన తెలంగాణ ప్రజలు.. నమ్మకంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండోసారి పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ టీఆర్‌ఎస్‌ 2.0 ప్రభుత్వంలో సంక్షేమం డబుల్‌ అయ్యింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపకపోవడమే ఇందుకు నిదర్శనం. సర్కారు సంస్కరణలు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ఒకసారి పరిశీలిస్తే ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ప్రగతే కనిపిస్తుంది. వ్యవసాయంలో నియంత్రిత సాగు.. నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌, పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం, జిల్లాల్లో ఐటీ వెలుగులు, ఆర్టీసీలో కార్గో సేవలు, మిషన్‌ భగీరథతో 95 శాతానికి పైగా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు.. ఇలా ఒకటేమిటి.. చెప్పుకుంటూ మరెన్నో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఐటీ రంగం కూడా కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే టాప్‌లో ఉన్న ఐటీ సెక్టార్.. ఇప్పుడు జిల్లాలకు సైతం విస్తరిస్తోంది. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు పల్లెల బాట పట్టాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఐటీ విస్తరించగా.. తాజాగా ఖమ్మంలోనూ ఐటీ రంగం కాలుమోపింది. అలాగే మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలోనూ ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. అటు సిద్దిపేట జిల్లాలోనూ ఐటీ టవర్‌కు బీజం పడింది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటును మించాయి. కరోనా సమయంలో జాతీయస్థాయిలో ఐటీ వృద్ధిరేటు 8.09 శాతం ఉండగా, తెలంగాణలో 17 శాతం నమోదైంది. లుక్‌ ఈస్ట్‌ విధానాన్ని అమలు చేస్తుండటంతో హైదరాబాద్‌ నలువైపులా ఐటీ విస్తరిస్తున్నది. కాగా, అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుండటం విశేషం.