భాగ్యనగర వాసులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.

 


రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం ప్రకటన మేరకు 20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ప్రజలకు నీటి సరఫరా చేస్తామన్నారు. శనివారం నాడు హైదరాబాద్ జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2021 నూతన సంవత్సరం తొలి వారంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20వేల లీటర్ల తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు మరియు నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా చేరేలా జలమండలి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో తాగునీటి వినియోగం పెరుగుతుందని, దానికి అనుగుణంగా జలమండలి నీటి సరఫరా సామర్థ్యం కూడా ఏడాదికేడాది పెంచుకునేలా చర్యలు చేపట్టాని అధికారులను ఆదేశించారు. ఇక వచ్చే వేసవికి సైతం సరిపోయే విధంగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.