ముంబై: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఓటీటీ (ఓవర్ ది టాప్) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో రెండు రోజుల పాటు 'స్ట్రీమ్‌ఫెస్ట్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. డిసెంబర్ 5 తెల్లవారుజామున 12.01 గంటల నుంచి డిసెంబర్ 6 రాత్రి 11.59 గంటల వరకు ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, వెబ్ సిరీసులు, షోలు, భారతీయ భాషల్లోని కంటెంట్‌ను ఉచితంగా వీక్షించొచ్చు. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో చందాదారులుగా చేరనివారు ఈ రెండు రోజులపాటు ఆ ప్లాట్‌ఫామ్ సేవలను ఉచితంగా పొందేందుకు వీలవుతుంది. కొత్త వినియోగదారులను ఆకర్షించాలన్న లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ఫెస్ట్ను నిర్వహిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లోని కంటెంట్‌ను 48 గంటలు ఉచితంగా యాక్సెస్ చేయడానికి లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. కంటెంట్‌ను వీక్షించాలంటే Netflix.com/StreamFestను సందర్శించడం లేదా ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ సమయంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా ఎలాంటి చెల్లింపులు అవసరంలేదు. భవిష్యత్‌లో చెల్లింపుల కోసం ఎలాంటి డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని కంపెనీ అడగదని వెల్లడించింది. ఆండ్రాయిడ్ యాప్ లేదా బ్రౌజర్ ద్వారా ఒకసారి లాగిన్ ఐతే స్మార్ట్‌టీవీ, ఐఓఎస్ డివైజ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల్లో నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, భారీ వెబ్‌సిరీస్‌లు, అవార్డు విన్నింగ్స్ డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలను రెండు రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే