రష్యాన్ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి రెడీ.

 


రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి తన మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. తాజా ఫలితాల్లో 91.4 శాతం సమర్ధత కలిగినట్లుగా నిరూపణ అయిందని గమలేయ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో వ్యాక్సిన్ 100 శాతం పనిచేస్తోందని స్పష్టం చేసింది. స్పుత్నిక్‌-వి మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చిన 21 రోజుల తర్వాత పరిశీలించగా 91.4 శాతం పనిచేస్తున్నట్లు తెలిసింది. తాజాగా రెండు డోసులను తీసుకున్న వలంటీర్ల సమాచారాన్ని 21 రోజుల తర్వాత వెల్లడించారు. ఇందులో 78 మందికి వైరస్ సోకినట్లు నిరూపణ అయింది. అయితే ఇందులో 62 మంది ప్లెసిబో గ్రూపునకు చెందిన వారేనని గమలేయ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. అయితే తాజా ఫలితాల ద్వారా తమ వ్యాక్సిన్ 90 శాతం పైగా పనిచేస్తోందని స్పుత్నిక్‌-వి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని పేర్కొంది. కాగా మూడో దశ క్లినికల్ ప్రయోగాల నిబంధనల అనుసారం వ్యాక్సిన్ సమర్ధతపై మధ్యంతర ఫలితాలు మూడు దశల్లో లెక్కించినట్లు గమలేయా తెలిపింది. వ్యాక్సిన్, ప్లెసిబో తీసుకున్న వారిలో 20 కేసులు నమోదైనపుడు ఒకసారి, 39 కేసులకు మరోసారి, 78 కేసులు నమోదైనపుడు వాటి సమర్ధతను విశ్లేషించామని తెలియజేసింది. మూడోదశలో కేవలం రష్యాలోనే 26వేల మందికి వ్యాక్సిన్ అందించారు.