మత్స్యకారుల వలలో అరుదైన సొరచేప.

 


తిరువనంతపురం: కేరళకు చెందిన మత్స్యకారుల వలకు అరుదైన సొరచేప చిక్కింది. అయితే ఆ సొరచేప సజీవంగా ఉండటంతో మత్స్యకారులు దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు. అయితే అజిత్ అనే వ్యక్తి ఆ సన్నివేశాన్ని మొత్తం ఫోన్‏లో రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఆ మత్స్యకారులు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. అంతేకాక అంతరించిపోతున్న ఆ చేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టిన మత్స్యకారులు అటవీ శాఖ నుంచి అరుదైన అవార్డును అందుకోనున్నారు. ఇదే విషయంపై మత్స్యకారులు మాట్లాడుతూ.. ” వాతావరణ అధికారులు సలహా మేరకు మేమంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. దీంతో తీరం నుంచే చేపలు పట్టాం. అదే సమయంలో షాంఘుముఖం తీరం ఒడ్డున మా వలలో ఒక పెద్ద సొరచేప చిక్కింది. వెంటనే అందరం కలిసి దానికి బయటకు లాగి తీశాం. ఇంతవరకు అలాంటి సొరచేపను మేము ఎప్పుడు చూడలేదు. అంతరించిపోతున్న అరుదైన జాతి సొరచేపగా మేము గుర్తించాం. అది ఇంకా ప్రాణాలతో ఉండటంతో తిరిగి సముద్రంలోకి వదిలాం” అని చెప్పారు. అయితే ఇలాంటి చేపలు సముద్రంలో మధ్యలో ఉంటాయని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీరానికి వచ్చి ఉంటుందని వారు తెలిపారు. దీంతో ఆ సొరచేప పట్ల బాధ్యతగా వ్యవహరించిన మత్స్యకారులను ప్రశంసిస్తూ, వారందరిని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అవార్డుతో సత్కరించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.