నిలిచిపోయిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. ఆగిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.

 


ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆగిపోవడంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో తెలంగాణలో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కార్డు పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ లేని వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో ఆయా ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లస్టర్లు, గ్రూపులుగా విభజించి పరిష్కరించాలని పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఫీర్జాదిగూడ నగరపాలికలో పైలట్ పద్ధతిన కొంత ప్రక్రియ కూడా చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నాలుగు ఐచ్ఛికాలను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటిని మళ్లీ అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ జరగని వాటికి మాత్రం ఎల్​ఆర్​ఎస్​ చట్టం వర్తింప చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. భవన నిర్మాణ సమయంలోనే ఎల్​ఆర్​ఎస్​ మొత్తం చెల్లించేలా నిబంధన పెట్టడమా లేదా? అనే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే కొనుగోలు దారుడి నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.