ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకానికి నమోదు చేసుకునేందుకు గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్‌ఫో నమోదును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులు గుర్తించాలన్నారు. కొత్త విద్యార్థుల నమోదు, ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను నవీకరణ చేయాలన్నారు. అర్హత ఉన్న తల్లుల జాబితాను ఈనెల 20వ తేదీన సంబంధిత పాఠశాలల్లో ప్రదర్శించడం జరుగుతుందని అధికారులు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి విడతల వారిగా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.