అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు.

 


అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనిషిగా చెబుతున్నానంటూ.. తన మాటలను విశ్వసించాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు మరోసారి ప్రకటించారు. అమరావతిలో భారతీయ కిసాన్ సంఘ్ సోమవారం కేంద్ర వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా నిర్వహించిన సదస్సులో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ మోదీ మనిషిగా చెబుతున్నా అమరావతే రాజధాని.. మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి నిదర్శనం ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.. అమరావతిలోనే రాజధాని ఉండాలి.. రెండో అంశానికి తావులేదు.. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ స్థానిక రైతుల చేస్తున్న ఆందోళన పర్వం ఏడాది పూర్తి చేసుకోబోతున్న తరుణంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తొలి నుంచి చెబుతున్న మాటలే అయినప్పటికీ.. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ ఇంత గట్టిగా వ్యతిరేకిస్తుందన్న సంకేతాలు తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో వెలువడ్డాయి.