కరోనా ప్రభావం ఆస్ట్రేలియా-టీమిండియా ఆటపై పడింది. వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో భారత మహిళా జట్టు ఆడాల్సిన వన్డే సిరీస్‌ను 2022కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. కరోనానే ఇందుకు కారణమని వెల్లడించింది. ఆస్ట్రేలియా-టీమ్ఇండియా మధ్య మూడు మ్యాచుల మహిళా వన్డే సిరీస్ 2021 జనవరిలో జరగాల్సి ఉంది. అయితే 2022 మార్చిలో ప్రారంభంకానున్న మహిళా వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్‌ను నిర్వహించేలా ప్లాన్ చేసినట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లే స్పష్టం చేశారు. వన్డేతో పాటు మరో మూడు టీ20లను కూడా ఈ పర్యటనలో ఉంటాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2022 మహిళా ప్రపంచకప్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఆడబోయే ఎనిమిది జట్లు మొత్తం 31 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్ ఇప్పటికే అర్హత సాధించాయి. మిగతా మూడు జట్లు అర్హత సాధించేందుకు శ్రీలంకలో జూన్26 నుంచి జులై 10వరకు జరగబోయే ఐసీసీ అర్హత టోర్నీలో తలపడాల్సి ఉంది.