చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ నుండి అప్డేట్.

 


మలయాళంలో సూపర్ హిట్‌ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి తాజాగా దర్శకుడు ఫైనల్ అయ్యాడు. ‘త‌ని ఒరువ‌న్’ ఫేం మోహ‌న్ రాజా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ”మన నేటివిటీకి తగ్గట్టుగా ‘లూసిఫర్’ సినిమా స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. అలాగే నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది” అని చిరంజీవి పేర్కొన్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమా దర్శకుడు మోహన్ రాజాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘ధృవ’ అనే టైటిల్‌తో తెరకెక్కి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.