ఫైజర్ సంస్థ కు భారత్ ప్రభుత్వ. ఆమోదం కావాలి

 


అధికారికంగా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం భారత ప్రభుత్వ ఆమోదం కావాలని ఫైజర్ సంస్థ కోరింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీ సీ జీ ఐ) కి దరఖాస్తు చేసింది. బ్రిటన్, బహరైన్ దేశాల్లో ఈ టీకామందు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇండియాలో ఇప్పటికే సుమారు 96 లక్షలమందికి కరోనా వైరస్ సోకినా నేపథ్యంలో..డీసీజీఐకి ఈ విధమైన అభ్యర్థన రావడం ఇదే మొదటిసారి. ఇండియా బయట నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై సంతృప్తి చెందిన పక్షంలోనే ఈ సంస్థ ఎమర్జెన్సీ ఆమోదానికి వీలవుతుంది. ఫైజర్, జర్మన్ బయో టెక్నాలజీ పార్ట్ నర్ బయో ఎన్ టెక్ సంస్థ సంయుక్తంగా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ని క్లియర్ చేసిన తొలి దేశంగా బ్రిటన్ పాపులర్ అయింది. ఈ టీకామందు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 95 శాతం నాణ్యమైనదని తేలినట్టు ఈ కంపెనీలు పేర్కొన్నాయి. కొత్త డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ (2019) కింద ప్రత్యేక నిబంధనల ప్రకారం.. ఇండియాలో తమ టీకామందు దిగుమతికి, పంపిణీకి అనుమతించాలని ఫైజర్ సంస్థ తన దరఖాస్తులో కోరింది. దీన్ని పరిశీలిస్తున్నట్టు డీ సీ జీ ఐ అధికారవర్గాలు వెల్లడించాయి. 90 రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశాలున్న కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు ఇండియాలో ఉన్నాయా అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పలు టీకామందులను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిల్వ ఉంచుతారు. భారత జనాభాకు అవసరమైనంత ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండకపోవచ్చునని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిద్ పై నేషనల్ టాస్క్ ఫోర్స్ హెడ్ కూడా అయిన డాక్టర్ వీకే.పాల్ అభిప్రాయపడ్డారు. భారత రెగ్యులేటరీ సంస్థల ఆమోదం లభించిన అనంతరం ఫైజర్ వ్యాక్సిన్ సేకరణ, పంపిణీపై గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు