న్యూమోనియా బాధితులకు శుభవార్త.

 


ఇండియాలో తొలిసారిగా న్యూమోనియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. లాక్ డౌన్ సమయంలో అతి పెద్ద టీకా ఉత్పత్తిదారుగా పేరుగాంచిన పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన మొదటి టీకాను తయారు చేసింది. దాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు ‘న్యుమోకాకల్ పాలిసాకరైడ్ కంజుగేట్’ వ్యాక్సిన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా దేశంలో వాడుతున్న న్యూమోనియా వ్యాక్సిన్లు అన్నీ కూడా విదేశీ సంస్థలకు చెందినవే. ఇక ఇప్పుడు తొలిసారిగా లాంచ్ కానున్న స్వదేశీ వ్యాక్సిన్ వాటి కంటే తక్కువ ధరలో లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకాకు సంబంధించిన అన్ని క్లినికల్ ట్రయిల్స్‌ డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి జూలైలో అనుమతి లభించిన సంగతి తెలిసిందే. శిశువులలో ‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా’ వల్ల కలిగే ఇన్వాసివ్ డిసీజ్, న్యుమోనియాకు వ్యతిరేకంగా క్రియాశీల రోగనిరోధక శక్తి కోసం ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్‌ను సీరం సంస్థ భారత్‌తో పాటు ఆఫ్రికా దేశమైన గాంబియాలో కూడా జరిపింది. కాగా, ప్రధాని మేకిన్ ఇండియా కలలను నెరవేర్చడంలో భాగంగా తాము ఈ ప్రయత్నం చేశామని.. మొట్టమొదటి ప్రపంచ స్థాయి స్వదేశీ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను అభివృద్ధి చేసి లాక్‌డౌన్ సమయంలో మరో మైలురాయిని అందుకున్నామని సీరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆక్స్‌ఫోర్డ్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.