గత కొద్ది నెలలుగా వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఫేస్బుక్ యాజమాన్యంలోని ఛాటింగ్ దిగ్గజం వాట్సాప్. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో ఛాటింగ్ చేసేటప్పుడు ప్రతీ చాట్ పేజ్ కు ఒక కొత్త వాల్ పేపర్ ను సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి కోసం ప్రత్యేకంగా వాల్ పేపర్ గ్యాలరీని కూడా అప్డేట్ చేసింది వాట్సాప్. అలాగే వినియోగదారుడు టెక్ట్స్ లేదా ఎమోజీల సహాయంతో కొత్త స్టిక్కర్ ను వెతికే ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు తెలిపింది. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త అప్డేట్లో ప్రతీ కాంటాక్ట్ కు లేదా గ్రూప్ కు వేరే వాల్పేపర్లను సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీంతో, వినియోగదారులు తమ చాట్లను గుర్తించడం సులభతరం అవుతుంది. అంతేకాక, పొరపాటున తప్పు చాట్‌ను ఎంచుకోవడాన్ని కూడా నివారిస్తుంది. " కస్టమ్ వాల్‌పేపర్‌ను ఉపయోగించడం ద్వారా మీ అతి ముఖ్యమైన చాట్లను వ్యక్తిగతంగా, విభిన్నంగా మార్చుకోవచ్చు. గందరగోళంలో ఒకరి పంపాల్సిన మెసేజ్ ను మరొకరికి పంపడంపై మీరు ఎప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు." అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్ ప్రకారం, యూజర్లు తమ వాల్ పేపర్ ను సెట్ చేసేకునే అవకాశం ఉన్నప్పటికీ అన్ని కాంటాక్ట్ లకు ఒకే రకమైన వాల్ పేపర్ వర్తిస్తుంది. అయితే, కొత్త ఫీచర్ ప్రకారం, వాట్సాప్ ఛాట్లలో లైట్, డార్క్ మోడ్ సెట్టింగులతో కూడిన ప్రత్యేక వాల్పేపర్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం వినియోగదారులు తమ వాట్సాప్ కాంటాక్ట్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి మొదట వాట్సాప్ యాప్ ను తెరవాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులోని వాల్‌పేపర్ ఆప్షన్‌లోకి వెళ్లి వారి స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ నుంచి ఏదైనా చిత్రాన్ని సెలెక్ట్ చేసుకొని స్టాటిక్ వాట్సాప్ వాల్‌పేపర్‌గా మార్చుకోవచ్చు. అయితే, నూతన ఫీచర్ ను పొందాలంటే మాత్రం వినియోగదారులు సంబంధిత ఛాట్‌ను తెరవడం ద్వారా ప్రతి చాట్‌తో వేర్వేరు వాల్పేపర్లను ఎంచుకోగలుగుతారు. దీనికి గాను వాట్సాప్‌లో ఉండే ఆప్షన్స్‌లోకి వెళ్లి వాల్‌పేపర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై మీ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ నుండి కావలసిన వాల్‌పేపర్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ ను వాట్సాప్ వెబ్‌లో కాకుండా మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వాట్సాప్ తెలిపింది