హైదారాబాద్‌ అల్వాల్‌లో దారుణం .

 


హైదారాబాద్‌ అల్వాల్‌లో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం కిరాతక హత్యకు దారితీసింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. అల్వాల్‌కు చెందిన కనకరాజుకు ఓ యువతితో అక్రమ సంబంధం ఉంది. అయితే అదే అమ్మాయితో శ్రీకాంత్ రెడ్డి అనే ఆటో డ్రైవర్‌కి కూడా అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి సదరు యువతిని ఆరు నెలల క్రితం తీసుకెళ్లిపోయాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డిపై పగ పెంచుకున్న కనకరాజు.. చాలాకాలం పాటు వారికోసం గాలించాడు. ఎట్టకేలకు ఐదు రోజుల క్రితం వాళ్లిద్దరినీ పట్టుకుని అల్వాల్‌కు తీసుకువచ్చాడు. జవహర్ నగర్‌లోని ఒక ఇంట్లో ఇద్దరినీ బంధించాడు. పది రోజుల పాటు శ్రీకాంత్ రెడ్డిని చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డిని కనకరాజు తన స్నేహితులతో కలిసి చంపేశాడు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని స్మశాన వాటికలో పూడ్చిపెట్టాడు. అయితే తాజాగా ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన కనకరాజు.. తాను చేసిన హత్య గురించి వారికి వెల్లడించాడు. ఈ విషయం చివరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులకు చేరింది. దీంతో కనకరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. కనకరాజు ఇచ్చిన సమాచారం మేరకు స్మశాన వాటికలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోలీసుల సమక్షంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యలో పాల్గొన్న నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా, కనకరాజు ఓ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది.