తెరపైకి మరో బయోపిక్.

 


ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా పేరుతో రాబోతున్న బయోపిక్‏లో తాను నటించడం లేదని హీరో మాధవన్ స్పష్టం చేశారు. ఇటీవల రతన్ టాటా జీవిత కథ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని, అందులో హీరో మాధవన్ మెయిల్ రోల్‏లో నటించనున్నారని ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ రూమర్స్ పై శనివారం మాధవన్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ” హే దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానులు ఈ ఫేక్ పోస్టును క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్టున్నారు. ఇందులో ఏంతమాత్రం నిజం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం ఇంతవరకు నా దగ్గరకు రాలేదు. అందుకోసం ఎవరితోనూ.. ఎలాంటి చర్చలు జరగలేదు” అని మాధవన్ పేర్కొన్నారు. కాగా ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ ఆధారంగా ఓ సినిమా చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. లైకా ప్రొడక్షన్‏లో ఈ మూవీ నిర్మిస్తున్నారని, 2021లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హీరో మాధవన్ ఉన్న ఫోటోపై రతన్ టాటా అని రాసి ఉన్న ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఇటీవల మాధవన్, అనుష్క జంటగా నిశ్శబ్ధం మూవీ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా నటించారు.