‘సోలో బతుకే సో బెటర్’ సినీమా పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.

 


సాయిధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ తర్వాత విడుదల కానున్న తొలి భారీ చిత్రం ఇదే కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘సోలో బతుకే సో బెటర్’ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెపుతూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ క్రిస్మస్‌కు విడుదలవుతోన్న సోలో బతుకే సో బెటర్ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్‌లు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.