మెగా ఫ్యామిలీ లో కరోనా కలవరం..

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మంగళవారం ఉదయం తెలియజేశారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రామ్ చరణ్‌కు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మెగా అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, ఇప్పుడు చరణ్ తమ్ముడు, నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని రావడం మెగా ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. తనకు కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''ఈరోజు ఉదయం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను'' అని వరుణ్ తేజ్ పేర్కొ్న్నారు. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీలోని రెండో తరం సభ్యులంతా డిసెంబర్ 25న క్రిస్మస్‌ను కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, కళ్యాణ్ దేవ్, ఉపాసన, స్నేహారెడ్డి, సుష్మిత, శ్రీజ, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీ వల్లే వీరి మధ్య వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.