కొనసాగుతున్న కమలనాథుల ఆపరేషన్ "ఆకర్ష్".

 


కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన మరో సీనియర్‌ నేత తాజాగా రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్‌ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. నారాయణరెడ్డి కాషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం చాలా రోజులగా కొనసాగుతుంది. ఇక విజయశాంతి కమలంగూటికి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. గూడూరు నారాయణరెడ్డికి కాంగ్రెస్‍ పార్టీతో గత 39 ఏళ్లుగా అనుబంధం ఉంది. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేశారని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆయన హైదరాబాద్‍ కు వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.