అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్

 


ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంటే కుల, మత, ప్రాంత బేషజాలు లేకుండా ఉండాలన్నారు. అలా కాకుండా పేదలు సహా ఏ కులం వారు రాజధానిలో ఉండకూడదంటే దానిని రాజధాని అంటారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అమరావతిలో 54వేల మంది పేదలకు పట్టాలివ్వాలని కార్యాచరణ చేపట్టి ముందడుగు వేస్తే.. కులపరమైన అసమతుల్యత అంటూ కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగ.. న్యాయస్థానం వెంటనే స్టే విధించిందన్నారు. ఈ విషయంలో కోర్టు నిర్ణయం ఆశ్చర్యమేసిందన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అంతా కలిసి ఉంటేనే రాజధాని అంటారన్న ఆయన.. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అవుతుందని పేర్కొన్నారు. సమానత్వంతో కూడిన రాజధానిని తాము నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ ఉద్ఘాటించారు.