బీహార్ లో ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ.

 


రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తామన్న జేడీ-యూ, బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుపై సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ హామీని నెరవేర్చేందుకు సమాయత్తమైంది. గతనెలలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగిన అనంతరం కేబినెట్ తొలి సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వ్యాక్సిన్ ఇచ్ఛే తేదీలపై ఖఛ్చితమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 20 లక్షల ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది. కానీ ఇన్ని లక్షల జాబ్స్ ను ఎలా సృష్టించాలన్నదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. మహిళా సాధికారతకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవివాహిత గ్రాడ్యుయేట్ యువతులకు 50 వేల రూపాయల ఫిక్స్డ్ గ్రాంట్, స్కూలు చదువు పూర్తి చేసిన బాలికలకు 25 వేలు మంజూరు చేస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చనుంది. యువ పారిశ్రామివేత్తలు కాగోరిన మహిళలకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలు కూడా ఇవ్వనున్నారు. ఇలా ఉండగా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఫైజర్, భారత్ బయో టెక్ సంస్థలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్ట్టు కేంద్రం తెలిపింది. వీటి పరిశీలనలో ఇప్పటికే జాప్యం జరిగిందని ఈ రెండు కంపెనీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కాగా కేవలం బీహార్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు పట్టుబడుతున్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్టాల్లోనే ఈ పంపిణీ చేబడుతున్నారని ఆరోపిస్తున్నాయి.