హైదరాబాద్ నగరంలో ప్రత్యేక నిఘా.

 


డిసెంబర్‌ 31 రాత్రి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్లలో మునిగిపోతామంటే ఈ ఏడాది కుదరదు. ఈవెంట్లతో పాటు అన్ని హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లపైనా నిఘా పెట్టారు పోలీసులు. సైబరాబాద్‌ పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. అనుమతిచ్చిన సమయం వరకే పబ్బులు నడపాలన్నారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌. రిసార్ట్స్, పబ్బులు, స్టార్‌ హోటళ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఫంక్షన్‌ హాళ్లు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోనూ అనుమతిలేదని చెప్పారు. డిసెంబర్ 31న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయని ప్రకటించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల లోనూ న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు అనుమతి లేదు.. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే ఫిర్యాదు చేయాలని తెలిపారు. బార్లు, పబ్‌లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్‌లైన్‌లో పెట్టినా డయల్‌ 100, వాట్సాప్‌ కాల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబరాబాద్‌ పరిధిలో ఎక్కడ కూడా ఎక్కువ మంది గుమికూడటానికి అనుమతి లేదని సైబరాబాద్‌ సీపీ తెలిపారు. ఒకవైపు కొత్త రకం కరోనా హడలెత్తిస్తోన్న ఈ సమయంలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ పేరుతో అధిక సంఖ్యలో జనం ఒక్కచోటికి రావడం వల్ల వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది న్యూ ఇయర్‌ వేడుకలకు అంతా దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.