మరో రంగం లోకి అడుగు పెట్టనున్న టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ.

 


ఆపిల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టనుంది. అదే కార్ల వ్యాపారం.. త్వరలోనే రోడ్లపై ఆపిల్ కార్లు పరుగులు పెట్టనున్నాయని తెలుస్తోంది. 2024 నాటికి మార్కెట్లోకి కారును తీసుకు రావడానికి ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ నుంచి రానున్న ఈ కార్లలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో LIDAR (లేజర్ లైట్‌తో దూరాన్ని కొలిచే) వ్యవస్థ కూడా అందించనుందని, బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించనున్నారని సమాచారం. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఓ అంతర్జాతీయ వార్త సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆపిల్ ‘టైటాన్’ అనే పేరును కూడా నిర్ణయించందని సదరు వార్తా సంస్థ తెలిపింది. ఇదిలే ఉంటే.. నిజానికి తొలిసారి 2014లోనే కార్ల త‌యారీపై ఆపిల్ దృష్టి సారించింది. అంత‌కుముందు యాపిల్‌లో ప‌ని చేసి టెస్లాకు వెళ్లిన సీనియ‌ర్ ఉద్యోగి డాగ్ ఫీల్డ్‌ను 2018లో మ‌ళ్లీ వెన‌క్కి ర‌ప్పించింది ఆపిల్‌. అయితే 2019లో ఈ టీమ్ నుంచి 190 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆపిల్ కార్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈసారైనా ఆపిల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి.