మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ .

 
దేశంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆత్మ నిర్బర భారత్ పథకంలో భాగంగా స్వదేశీ పరిజ్జానంతో రూపొందుతున్న పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ) లోని న్యూ భౌపూర్-న్యూ ఖుర్జా విభాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు కారిడార్‌కు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోత్సవం చేస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈడీఎఫ్‌సీలోని భౌపూర్‌-ఖుర్జా భాగాన్ని రూ.5,750 కోట్ల వ్యయంతో 351 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మించారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని ఈడీఎఫ్‌సీ కార్యాకలాపాల నియంత్రణ కేంద్రాన్ని సైతం ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించే కారిడార్‌ స్థానిక పరిశ్రమలకు వివిధ అవకాశాలను కల్పించబోతోంది. కొత్త ఈడీఎఫ్‌సీ విభాగం కాన్పూర్-ఢిల్లీ ప్రధాన లైన్‌ను డీకంజెస్టింగ్ చేయడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఈడీఎఫ్‌సీ కారిడార్ మొత్తం దూరం1,856 కిలోమీటర్లు. ఇది పంజాబ్‌లోని లూధియానా సమీపంలోని సహనేవాల్ నుండి ప్రారంభమై హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా పశ్చిమ బెంగాల్‌లోని డంకుని వద్ద ముగుస్తుంది. భారతీయ రైల్వేలు వేగంగా రైళ్లు నడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త 351 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ నిర్మాణంతో ఔరాయ జిల్లాలోని పాడి పరిశ్రమ, పుఖ్రాయన్ జిల్లాలోని అల్యూమినియం తయారీ పరిశ్రమలు ప్రయోజనం పొందనున్నాయి. కొత్త భూపుర్‌- న్యూ ఖుర్జా విభాగం కూడా హత్రాస్‌లో హింగ్ ఉత్పత్తి, బులంద్‌ షహర్ జిల్లాలోని ఖుర్జా కుండల ఉత్పత్తులు, ఫిరోజాబాద్ గ్లాస్ వేర్ పరిశ్రమ, అలీఘర్ తాళాలు, హార్డ్‌వేర్‌ పరిశ్రమ, ఎటావా జిల్లా వస్త్ర ఉత్పత్తిదారులు, బ్లాక్ ప్రింటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిని ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ నౌకాశ్రయానికి అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా డిఎఫ్‌సిసిఎల్ నిర్మిస్తోంది. 1,504 రూట్ కిమీ దూరం ఉండే ఈ కారిడార్ హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళుతుంది