వైఎస్సార్ జలకళ’ పథకం.వైఎస్సార్ జలకళ’ పధకానికి సంబంధించి అర్హత నిబంధనల్లో జగన్ సర్కార్ పలు మార్పులు చేసింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పధకం కింద ఓ రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. వాల్టా చట్టం ప్రకారం ఒక బోరుకు.. మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్లు దూరం ఉండాలనేది రూల్. అయితే ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో పక్కపక్కనే నాలుగు బోర్లు కావాలంటూ పలు దరఖాస్తులు చేశారు. దీనితో ఈ సమస్యను అధిగమించేందుకు పధకం అర్హత నిబంధనల్లో గ్రామీణాభివృద్ధి అధికారులు పలు సవరణలు సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం పలు మార్పులు, చేర్పులు చేసింది. ఇక నుంచి ఒక కుటుంబంలో ఎవరైనా ఈ పధకం కింద ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకుంటే.. అదే కుటుంబం నుంచి మరొకరు దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడదని.. వారి అనర్హులవుతారని పేర్కొంది. సవరించిన నిబంధనలు ఇలా ఉన్నాయి… గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పధకానికి అనర్హులు ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతుకు ఖచ్చితంగా రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే చుట్టుపక్కల రైతులతో కలిసి గ్రూప్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్‌ తర్వాత ఫెయిలైతే.. అక్కడ మరో బోరు వేయడానికి మరోసారి హైడ్రో జియాలజికల్‌ సర్వే జరపాల్సి ఉంటుంది. ఈ పధకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం 10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.