జగన్ సర్కార్ కీలక నిర్ణయం. మరో పథకానికి శ్రీకారం చుట్టనున్న జగన్ సర్కార్

 


ఏపీ ప్రభుత్వం మరో నూతన పధకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 21వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష’ పధకాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా దీనిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి డిసెంబర్ 21న సమగ్ర భూసర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో సర్వే పూర్తై,రికార్డులు సిద్ధం కాగానే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాలని తెలిపారు. సమగ్ర సర్వేపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని.. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. సర్వే జరిగేదిలా: గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అధికారులు భూసర్వే నిర్వహించనున్నారు. మొత్తం 17,460 గ్రామాలకు గానూ.. మొదటి విడతలో 5,000, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో భూసర్వే జరగనుంది. ఆ తర్వాత పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేపట్టనున్నారు. సుమారు 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూములతో పాటు 2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూముల్లోనూ అధికారులు సర్వే చేయనున్నారు. సర్వే తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు… భూసర్వే పూర్తయిన అనంతరం భూయజమానులకు ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డును ఇవ్వనున్నారు. ఈ కార్డులో యజమాని పేరు, ఫోటోతో పాటు ప్రాపర్టీ కొలతలు, మొత్తం ఏరియా, యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, క్యూ ఆర్‌కోడ్‌లు ఉంటాయి. ‌ఇక గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలను తెలిపేలా డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు తయారు చేయనున్నారు. అలాగే భూ కొలతలు పూర్తైన తర్వాత సర్వే రాళ్లు పాతుతారు. కాగా, గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్‌ రిజిస్టర్‌, వివాదాల నమోదుకూ రిజిస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ.. ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాససింగ్‌ టీం, రీసర్వే టీం ఉంటాయన్న అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటిదాకా 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని.. మిగిలిన వారికీ పూర్తి చేస్తామన్న వెల్లడించారు. అలాగే సర్వే ఆఫ్‌ ఇండియాతో డిసెంబర్ 9వ తేదీన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనే రెవిన్యూ సర్వీసులు.. ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాప్స్ సిద్ధం కాగానే.. అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు అందించాలని సీఎం అన్నారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లో మార్పులు చేయాలని సూచించారు. అలాగే భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ వివరించారు. సర్వే శిక్షణ కోసం తిరుపతిలో కొత్త కాలేజీ… సర్వేయర్లకు భూసర్వే శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలో కొత్త కాలేజీని ఏర్పాటు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలేజీ కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని.. దాని నిర్మాణం సమగ్ర సర్వే సందర్భంలోనే జరగాలని సీఎం అన్నారు.