ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో కొత్త వైరస్.

 


బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ మరోసారి ప్రపంచానికి చమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా కంటే అత్యంత వేగంగా వ్యాపి చెందుతుండటంతో జనాన్ని మరింత కలవరపెడుతుంది. ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమై కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. అయితే, ఇటీవ‌ల బ్రిట‌న్, ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన ప్రయాణికుల‌ను గుర్తించే పనిలో పడ్డాయి అయా దేశాల ప్రభుత్వాలు. యూకే నుంచి వచ్చిన వారికి క‌రోనా ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్న క్వారంటైన్‌కు తరలించి ఐసోలేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టర్కీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 14 త‌ర్వాత బ్రిట‌న్ నుంచి ట‌ర్కీ వ‌చ్చిన 4,603 మంది ప్రయాణికుల‌ను గుర్తించింది. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఒక్క ఆదివారం రోజే 335 మంది ప్రయాణికులు ట‌ర్కీకి వ‌చ్చార‌ని, వారంద‌రికి క‌రోనా ప‌రీక్షలు నిర్వహించామ‌ని పేర్కొన్నారు. కాగా, ఆదివారం సాయంత్రం నుంచి యూకే, సౌతాఫ్రికా, డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి వ‌స్తున్న విమానాల‌ను ర‌ద్దు చేశామ‌ని ట‌ర్కీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఫ‌హేరిట్టిన్ కోకా మంగ‌ళ‌వారం వెల్లడించారు. ప్రయాణికులకు అన్ని రకాల వైద్యం సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.