ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం.

 


దేశవ్యాప్తంగా టోల్‌గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపులు జరపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫాస్టాగ్ ఉన్న నాలుగు, అంతకంటే ఎక్కువ చక్రాలున్న వాహనాలను మాత్రమే టోల్‌ప్లాజాల్లోకి అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పర్యవేక్షించేందుకు మార్షల్స్, నోడల్ అధికారులను నియమించింది. ట్యాగ్ లేకుండా ఏ వాహనం టోల్ ప్లాజాల్లోకి ఎంటరైనా డబుల్ ట్యాక్స్ వసూలు చేయాలని తెలిపింది. కాగా, 2017 నుంచి కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ లేని వాహనాల కోసం రెండు క్యాష్ కౌంటర్‌లను ఏర్పాటు చేస్తూ వచ్చింది. త్వరలోనే వాటిని కూడా క్రమక్రమంగా తొలగిస్తామని తెలిపింది. ఇక ఫాస్టాగ్ లేనివాళ్ల కోసం ప్రతీ టోల్ ప్లాజా వద్ద రెండు నుంచి ఎనిమిది ఫాస్టాగ్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.