ఏపీ సీఎం జగన్ ఏలూరు పర్యటన.

 


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు వింత వ్యాధికి గురవుతున్నారన్న విషయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వెంటనే ఈ అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. సీఎం ఆదేశాలతో మంత్రి ఆళ్ల నాని ఇవాళ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం ఏలూరు బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు.