కళాశాలలో విద్యార్థులకు తరగతులు ప్రారంభం.

 


కళాశాలల్లో ఆఖరి ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నెలలో పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. సడలింపుల తర్వాత పరిశోధక, పీజీ రెండో ఏడాది విద్యార్థులకు మాత్రం ఈ నెల 2వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు. యూజీ ఆఖరి ఏడాది విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకారం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు ప్రారంభించారు. కరోనా నిబంధనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటించారు. చెన్నైలో విద్యార్థి వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడకుండా నగర వ్యాప్తంగా 250 ప్రాంతాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. పలు కళాశాలల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. చెన్నై: విళుపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు సోమవారం తెరుచుకున్నాయి. తరగతి గదులను క్రిమిసంహారక మందుతో శుద్ధి చేశారు. కళాశాలలకు వచ్చిన విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతే లోనికి అనుమతించారు. విద్యార్థులు తమ ఇష్టం మేరకు తరగతులకు హాజరు కావచ్చంటూ ప్రభుత్వం పేర్కొనడంతో విళుపురంలోని ప్రభుత్వ అణ్ణా ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు 50 శాతం మంది విద్యార్థులు వచ్చారు. వేలూం్‌: డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రాంగణాలు, వసతి గృహాల్లో సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని సూచించారు. వేలూం్‌లో ప్రభుత్వ ముత్తురంగం కళాశాల, ఊరీసు కళాశాల, డీకేఎం మహిళా కళాశాల, ఆక్సీలీయం కళాశాలలో తరగతులు ప్రారంభించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరమే విద్యార్థులను అనుమతించారు.