ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ.

 


ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో పాటు, పలు శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి నాటికి రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని సూచించారు. ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 3వ వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే రోజు 10 కిలోల రైస్ బ్యాగ్‌ ఆవిష్కరణ ఉండనుంది. ఇందు కోసం 9260 మొబైల్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులను అందించేందుకు 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు రెడీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు వాహనాలు అందించనున్నారు. ఇందులో ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, బీసీలకు 3875, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. లబ్దిదారుడు కేవలం 10 శాతం వాటాను మాత్రమే సమకుర్చాల్సి ఉంటుంది.. మిగిలినదానిలో 30 శాతం సబ్సిడీ, బ్యాంకు ద్వారా 60 శాతం రుణం ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.