దేశంలో 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్.

 


దేశంలో 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇవ్వవచ్ఛు.. ఈ మేరకు ప్రభుత్వం అనుమతించింది. నిజానికి 12 ఏళ్ళు పైబడినవారికి ఈ టీకామందును ఇదివరకే ఇస్తున్నప్పటికీ, తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమ క్లినికల్ ట్రయల్స్ నిర్విరామంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు వలంటీర్ల రుగ్మత లేదా అస్వస్థతకు సంబంధించి ఎలాంటి కేసూ నమోదు కాలేదని భారత్ బయోటెక్ వెల్లడించింది. మూడో విడతలో 25 వేలమందికి పైగా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది. కాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ పై అనుమానాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు వెలిబుచ్చిన అభ్యంతరాలపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తీవ్రంగా స్పందిస్తూ ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కి డీసీజీఐ అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటు-కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని హడావుడిగా అనుమతించారని, థర్డ్ ట్రయల్స్ జరుగుతుండగానే ఇంత త్వరగా అనుమతించడం ఫ్రంట్ లైన్ వర్కర్ల ఆరోగ్యానికి దాదాపు ముప్పు తేవడం వంటిదేనని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ వంటి వారు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.