ఏపీలో ఈనెల 18 నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం.

 


ఏపీలో ఈనెల 18 నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభంకానున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్లో జరుపుతామని ఆయన తెలిపారు. త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏప్రిల్, మేలో జరిగే అవకాశముందని.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. కరోనా కారణంగా 30 శాతం మేర సిలబస్‌ తగ్గించామన్నారు. సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ ప్రకారం పోటీ పరీక్షలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే, 2020–21 విద్యా సంవత్సరం ఈ ఏడాది మే వరకూ కొనసాగుతుందన్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు