జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్ష తేదీలు విడుదల.

 


జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షను ఐఐటి ఖరగ్‌పూర్ నిర్వహించనున్నదని చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కనీసం 75 శాతం మార్కులు ఉండాలనే నిబంధనల తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ పరీక్షను జూలై 3 న నిర్వహించనున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో గతేడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించి, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కాలేక పోయిన వారు ఈ సారి నేరుగా అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు జేఈఈ మెయిన్-2021 పరీక్ష కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ వివరాలను కేంద్ర మంత్రి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. గతంలో నిర్వహించిన లైవ్‌ సెషన్‌లో జేఈఈ మెయిన్‌ను ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగు విడుతలుగా నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ప్రతి విద్యార్థి పరీక్ష రాసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు మొదటి జేఈఈ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన మిగిలిన వివరాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో చూడవచ్చు.