హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో టీ-20 ట్రాఫిక్‌ యాప్ విడుదల

 

దేశంలోనే తెలంగాణ పోలీసు పనితీరు
అద్భుతంగా ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ప్రశంసించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో టీ-20 ట్రాఫిక్‌ నిబంధనలతో కూడిన యాప్‌ను సోమవారం హోంమంత్రి ప్రారంభించారు. పోలీస్‌శాఖ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, సీఎం కేసీఆర్‌ రూ.700 కోట్లు కేటాయించి పటిష్టం చేశారన్నారు. శాంతిభద్రతలు బాగుండడం వల్లే నేడు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని వివరించారు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో నిందితుల పట్ల అంత కఠినంగా వ్యవహరించే సమర్థులు పోలీస్‌శాఖలో ఉన్నారని గుర్తుచేశారు. నగర పోలీసుకమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ రెండుమూడేండ్లలో ట్రాఫిక్‌ విభాగంలో చాలా మార్పులొచ్చాయని, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో నగర పోలీసులు తీసుకున్న కఠిన నిర్ణయాలే కారణమన్నారు. 18 ఏండ్లు నిండి లైసెన్స్‌ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సూచించారు. అనంతరం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిచే ప్లకార్డులను ప్రదర్శింపజేశారు.