28 ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం

 


హైదరాబాద్‌ మహానగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో రోడ్లు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోడ్డు దాటుతుండగా ప్రమాదాల బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలకు పుల్‌స్టాఫ్‌ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు చేపట్టిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తాజాగా.. బంజారాహిల్స్‌ జీవీకే వద్ద నిర్మిస్తున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి 6 వారాల్లో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అర్వింద్‌ కుమార్‌ శనివారం ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు. అదేవిధంగా గ్రేటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మరో 28 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవన్నీ 3 నెలల్లోనే ప్రారంభానికి సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలపై సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా మెట్ల మార్గాలతో పాటు లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో నగరంలో పాదచారులు హాయిగా రోడ్డు దాటేందుకు అవకాశం కలగనుంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎల్‌బీనగర్‌ జోన్‌లో చక్రీపురం క్రాస్‌ రోడ్డు, నాగారం విలేజ్‌ వద్ద లిప్టులతో, రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టాప్‌, కొత్తపేట పండ్ల మార్కెట్‌, సరూర్‌నగర్‌ స్టేడియం ప్రాంతాల్లో లిఫ్ట్‌ సౌకర్యంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా చార్మినార్‌ జోన్‌లో...స్వప్న థియేటర్‌, రాజేంద్రనగర్‌ ఎండీ పల్లి, సీబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌, ఓమర్‌ హోటల్‌, శాలీమార్‌ హోటల్‌ ప్రాంతాల్లో పుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇక ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో అరెమైసమ్మ టెంపుల్‌, లంగర్‌ హౌజ్‌, షేక్‌పేట పాస్‌పోర్టు ఆఫీస్‌, జీవీకే వన్‌, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌, పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌ ఎదురుగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌లోని హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి నారాయ ణగూడ ఫ్లై ఓవర్‌ వెళ్లే మార్గంలో, నేరేడ్‌మెట్‌ బస్‌స్టాపు, ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఎదురుగా, తార్నాకలోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వద్ద నిర్మిస్తున్నారు. కూకట్‌పల్లి జోన్‌లో బాలానగర్‌ ఎన్‌ఎస్‌ కేకే స్కూల్‌ వద్ద, షాపూర్‌నగర్‌లోని రంగా భుజంగా థియేటర్స్‌ వద్ద నిర్మిస్తున్నారు. అదేవిధంగా శేరిలింగంపల్లి జోన్‌లో ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని ఐడీబీఐ వద్ద, మియాపూర్‌లోని భాను టౌన్‌షిప్‌ వద్ద, సైబర్‌ గేట్‌వే, గచ్చిబౌలి టెలికం నగర్‌, మదీనాగూడలోని చెన్నై షాపింగ్‌ మాల్‌, చందానగర్‌లోని విజేతా సూపర్‌ మార్కెట్‌, మియాపూర్‌ ఆల్విన్‌ చౌరస్తాలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను 3 నెలల కాలంలో పూర్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తేనున్నామని పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అర్వింద్‌ కుమార్‌ తెలిపారు.  వేగంగా బాలానగర్‌ ఫ్లై ఓవర్‌..  బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు రూ.387 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టిన ఫై ఓవర్‌ నిర్మాణం ఉగాది నాటికి పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.1.13 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ కోసం రూ.265 కోట్లను భూసేకరణ కోసమే వెచ్చించి.. పెద్ద మొత్తంలో ఆస్తులను సేకరించారు. 6 లేన్‌లతో 24 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఫ్లైవర్‌ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే బాలానగర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు పుల్‌స్టాఫ్‌ పడనుంది.