కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదంపై మంత్రి కేటీఆర్ హర్షం.

 


కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల క్యాపిటల్‌గా హైదరాబాద్‌ మారుతోందని అన్నారు. ఆదివారం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు. కాగా, ఆక్స్‌ ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయన్న డీసీజీఐ డైరెక్టర్.. రెండు డోసులుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉంచాలన్నారు. ఇక డీసీజీఐ అనుమతి లభించడంతో కేంద్రం వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జైడస్ సంస్థ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కు కూడా అనుమతి ఇచ్చింది.