కోల్ కతా లో బాంబుల కలకలం.

 


కోల్ కతా లో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ఎంటాలీ ప్రాంతంలో పోలీసు స్టేషను సమీపంలోనే పలు బాంబులను పోలీసులు కనుగొన్నారు. నగర మిలిటరీ ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఖాకీలు వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనం లోని ఓ గదిలో రెండు బాక్సుల్లో వీటిని కనుగొన్నారు.మొత్తం 22 క్రూడ్ తరహా బాంబులు ఉన్నట్టు వారు చెప్పారు. వీటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాంబుల గురించిన సమాచారం తెలియగానే సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఉదంతం తీవ్రమైన విషయమని అధికారులు పేర్కొన్నారు. అసలే రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రోజురోజుకీ వైషమ్యాలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం తల్లడిల్లుతోంది. మరో వైపు ఈ నెల 30 న హోం మంత్రి అమిత్ షా మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రానున్నారని సమాచారం.