తెలంగాణ పీసీసీ ఛీప్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ.....

 


తెలంగాణ పీసీసీ ఛీప్ ఎన్నికపై గత నెలరోజులుగా చర్చ నడుస్తోంది. అప్పుడు, ఇప్పుడు, వారు, వీరంటూ అధిష్ఠానం ఊరిస్తుందే తప్ప ఎవ్వరి పేరు ప్రకటించడం లేదు. రెండు రోజుల నుంచి సోనియా దగ్గరి నుంచి ప్రకటన వస్తుందని ఎదురుచూసిన నాయకులకు నిరాశే మిగిలింది. నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ చీఫ్​ ప్రకటిస్తారని సమాచారం తెలిసింది. అప్పటి వరకూ ఉత్తమ్​నే టీపీసీసీ చీఫ్​గా కొనసాగించనున్నట్లు అధిష్టానం ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ సారథిని ప్రకటించడానికి ఎందుకంత మళ్లగుల్లాలు పడుతుందో తెలియడం లేదు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి పీసీసీ ఛీప్‌పై చర్చ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఈ విషయంపై తెలంగాణ అగ్ర నాయకులతో సమావేశం నిర్వహించి అధిష్టానానికి లేఖ కూడా పంపించారు. అయినా కూడా అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా ఇప్పుడు పీసీసీ ఛీప్ ఎన్నిక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాతే ఉంటుందని అంటున్నారు. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే పీసీసీ ఛీప్ ఎంపిక వల్ల పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రేవంత్‌రెడ్డిని పీసీసీ ఛీప్‌గా నియమిస్తే తాము ఒప్పుకోమంటు వి.హనుమంతారావు, జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిన్న,మొన్నటి దాకా జీవన్ రెడ్డి పేరు ఖరారైందని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కి, కొండా సురేఖ, సీతక్క, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు తదితరులు పీసీసీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని చాటాలని నాయకులు కోరుతున్నారు.