మూడు పాంట్లను మూసివేస్తున్నట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ వెల్లడిబ్రెజిల్‌లోని మూడు పాంట్లను మూసివేస్తున్నట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ ప్రకటించింది. సోమవారం నుంచి ఫ్యా్క్టరీలో ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలు లేకపోవడంతో గణనీయమైన నష్టాలు వచ్చాయని పేర్కొంది. పాంట్ల మూసివేత నిర్ణయంతో సుమారు 4800 మంది కార్మికులపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ జిమ్‌ ఫర్లే మాట్లాడుతూ 'దక్షిణ అమెరికా, బ్రెజిల్‌లో శతాబ్దానికిపైగా ఉన్నందున, ఇవి ఆరోగ్యకరమైన, స్థిరమైన వ్యాపారాన్ని సృష్టించడానికి చాలా కష్టమైన.. కానీ, అవసరమైన చర్యలని తెలుసు' అన్నారు. బ్రెజిల్‌లో ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా గ్లోబల్‌ పోర్ట్‌ ఫోలియాలో కొన్ని ఉత్తమమైన, ఉత్తేకరమైన వాహనాలతో వినియోగదారులకు సేవలు అందిస్తామన్నారు. అర్జెంటీనా, ఉరుగ్వేతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలించి బ్రెజిల్‌లో విక్రయాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
కాగా, ఫోర్డ్‌ నిర్ణయం బ్రెజిల్‌కు మరో దెబ్బలాంటిదే. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 2014 నుంచి పూర్తిగా దెబ్బతింది. మహమ్మారి మధ్య మరింత పెరింది. దేశంలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఫోర్డ్‌ నిర్ణయం బ్రెజిల్‌ రాజకీయంగా కలకలం సృష్టించింది. ప్లాంట్ల మూసివేత 'బ్రెజిల్‌ ప్రభుత్వంపై విశ్వసనీయత లేకపోవడానికి సంకేతం' అని ఆ దేశ దిగువ సభ స్పీకర్‌ రోడ్రిగో మైయా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో కమ్యూనికేషన్‌ సెక్రెటరీ ఫాబియా వాజ్గార్టెన్‌ స్పందించారు. ప్లాంట్ల మూసివేత నిర్ణయంపై 'బ్రెజిల్‌ రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. బ్రెజిల్‌లో ఫోర్డ్‌ 2020 సంవత్సరంలో అత్యధికంగా వాహనాలు విక్రయాలు చేపట్టిన ఐదో సంస్థగా నిలించింది. మార్కెట్‌ వాటా 7శాతంగా ఉంది.