ఘనంగా ప్రారంభమైన జల్లికట్టు పోటీలు

 


దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోళ్లు, ఎడ్ల పందేలు ఊపందుకున్నాయి. తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు మదురై జిల్లా అవన్యపురంలో ఘనంగా ప్రారంభమైయ్యాయి. 430 ఎద్దులు, 788 మంది కౌ బాయ్స్‌తో ఈ పోటీలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకు నిరాఘాటంగా సాగే ఈ క్రీడను చూసేందుకు వేలా మంది రానున్నారు.  ప్రతి ఏడాది తైపోంగళ కంటే ముందుగా మదురై జిల్లా అవన్యపురంలో జల్లి కట్టు పోటీలు ప్రారంభమవుతుంది. జల్లి కట్టుకు పెట్టింది పేరైన మధురైలో ఈ ఏడాది అత్యంత అట్టహాసంగా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలను తిలకించేందుకు డిఎంకే అధినేత స్టాలిన్ తనయుడు హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు. పోటీల సందర్భంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోటీ జరిగే ప్రాంతానికి రెండు వైపులా సెక్యూరిటీ వైర్ కంచెలు ఏర్పాటు చేశారు. కౌబాయ్స్ పోటీ సమయంలో ఫేస్ షీల్డ్స్ ధరించాలనే నిబంధన పెట్టారు.  మరోవైపు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించారు. ఘర్షణలకు తావులేకుండా పడగ్బందీ చర్యలు తీసుకున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 10 వైద్య బృందాలు, 108 అత్యవసర అంబులెన్సులు, ఎద్దుల కోసం ప్రత్యేక అంబులెన్సులు, ఫైర్ ట్రక్కులు ఏర్పాటు చేశారు. పోటీలు ముగిశాక ఉత్తమ కౌబాయ్, బుల్ యజమానులకు ప్రైజ్ గా బైక్ ను ఇవ్వనున్నారు. పోటీలో ఎద్దులను లొంగదీసుకున్న ఎద్దుల యజమానులకు బంగారం, వెండి నాణేలతో పాటు వివిధ బహుమతులు అందజేయనున్నారు. గంటకో రౌండ్ చొప్పున ప్రతి రౌండ్‌లో 50 కి పైగా కౌబాయ్‌లు అనుమతిస్తున్నారు.