విగ్రహాల ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.

 


ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సీఐడీ నుంచి సిట్‌కు విచారణ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. 16 మంది సభ్యులతో కూడా సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా ఐపీఎస్‌ అధికారి జీవీజీ ఆశోక్‌ కుమార్‌ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు జీవీజీ ఆశోక్‌ కుమార్‌. సిట్‌లో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో పాటు 16 మంది సభ్యులుగా ఉంటారు. సీఐడీ, ఇంటెలిజెన్స్, సైబర్‌ క్రైమ్‌, జిల్లాల ఎస్పీలు.. సిట్‌ బృందానికి సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలిచ్చారు. కేసు దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అడిషనల్ డీజీకి సిట్ వివరించనుంది. కాగా, ఆలయాలపై దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్‌ విచారణ జరుపుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‌రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు గత కొద్దిరోజులుగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.