రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్న బీసీ కులాలకు త్వరలో వంద శాతం సబ్సిడీతో రుణాలను అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2021 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీసీల సంక్షేమ భవన నిర్మాణాలకు 85 ఎకరాలు కేటాయించి, రూ.95 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. రూ.45 కోట్లతో భవనాల వద్ద అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి కేటీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలోని 40 బీసీ కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి త్వరలో ఆయా కుల సంఘాల ప్రతినిధులతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. యాదగిరి వంశరాజ్, ముత్తు వంశరాజ్, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్, మురళీకృష్ణతో పాటు సత్యనారాయణ, వెంకటేశ్, యువరాజ్, పాండు, వెంకటేశ్, నివాస్, గణేష్, సత్యం, వెంకటేష్, శ్రీనివాస్ యాదవ్, బాల నర్సింహ, శ్రీనివాసులు పాల్గొన్నారు.