దేశంలో ఏడు. రాష్ట్రాలకు విస్తరించిన బర్డ్ ఫ్లూ వైరస్

 


భారత్ దేశంలో ఓ వైపు కరోనా కేసులు నమోదవుతూ కల్లోలం సృష్టిస్తుంటే.. మరో వైపు బర్డ్ ఫ్ల్యూ రోజు రోజుకీ వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. పక్షుల మరణంతో బయటపడిన ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ క్రమంగా దేశంలో విస్తరిస్తోంది. తాజాగా ఏడు రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ విస్తరించిందని కేంద్ర పాడి పశుసంవర్ధక మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొదటిసారిగా రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు విస్తరించింది. పరిస్థితిని అంచానా వేసేందుకు ఇప్పటికే కేంద్రం బృందం బాధిత రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. హర్యానా సర్కార్ .. ప్రజల్లో అవగాహనా పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో కాకుల మరణంతో బర్డ్ ఫ్లూ పై అక్కడ కూడా ప్రవేశించిందా అనే అనుమానంతో ఇప్పటికే కాకుల మృతదేహాలను ల్యాబ్ కు పంపి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించింది. వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మ‌రో 10 రోజుల‌పాటు మూసి వేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. మరోవైపు చత్తీస్ గడ్ లో అకారణంగా పక్షులు మరణించినట్టు నివేదిక అందిందని ప్రభుత్వం ప్రకటించింది. పక్షులకు ఏవీయస్ ఇన్ ఫ్లూయెంజా సోకిందా లేదా తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. దీంతో అప్రమత్తమైన కేద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. ఎక్కడైనా అనుమదాస్పద పరిస్థితులు ఏర్పడితే తక్షణమే కేంద్రానికి తెలపాలని సూచింది