విగ్రహాల ధ్వంసం రాజకీయం అంటూ లోకేష్ ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ పై ఆగ్రహం

 


ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి టీడీపీ, బీజేపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు గర్తించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఇప్పటి వరకు మొత్తం 21 మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలను గుర్తించామని తెలిపారాయన. వీరిలో 13 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారని డీజీపీ తెలిపారు. నలుగురు బీజేపీ నాయకులు కూడా దేవాలయాలు ధ్వంసంపై అసత్య ప్రచారం చేశారని తెలిపారు.    డీజీపీ ప్రకటన వెలువడిన కాసేపటికే టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. డీజీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ”విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పిన డీజీపీ దొరా.. నేడు రాజకీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది.. రాత్రికి తాడేపల్లి కొంపలో జగన్ మార్క్ భోగి పళ్లేమైనా మీకు పోశారా? అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. విడుదల చేసిన జాబితాలో కర్నూలు జిల్లాలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం..? ఓంకార క్షేత్రంలో అర్చకులను చితక్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకు? ఆంజనేయుడు చేయి విరిగితే రక్తమొస్తుందా? రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు? అని ప్రశ్నించారు.    హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన డీజీపీపైనే ముందు కేసు పెట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్‌. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ ఏపీ పోలీసులు, డీజీపీపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తమ్మీద.. ఏపీలో దేవాలయాలపై డీజీపీ చేసిన ప్రకటన పెద్ద రాజకీయ దూమారాన్నే రేపుతోంది. ప్రతిపక్ష నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ముందు మందు ఇంకేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.