అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరో మారు నిషేధం పొడిగింపు అంతర్జాతీయ విమాన సర్వీసులపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిషేధాన్ని మరోసారి పొడిగించింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ సర్క్యులర్‌ను జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేశారు. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించడానికి కేంద్రం వందే భారత్‌ మిషన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి లక్షలాది మందిని భారత్‌కు తరలించారు. కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తారనుకున్న సమయంలో యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌తో మళ్లీ నిషేధం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 165 మంది దేశంలో యూకే కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.