రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు.

 


రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు  పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం ఆగడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఓవర్‌టెక్‌ చేయడం, అజాగ్రత్త వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా దట్టమైన పొగ మంచు కారణంగా ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తప్రదేశ్‌ లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై శుక్రవారం జరిగింది. దట్టమైన పొగమంచు ఉండటం వల్ల ముందున్నవి, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో 8 వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, కొత్త సంవత్సరం రోజే ముగ్గురు మృతి చెందడం వారి కుటుంబాల్లో విషాదంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.