వికారాబాద్‌: : కల్తీకల్లు ఘటనలో మరో ఇద్దరు మృతి

 


వికారాబాద్‌: కల్తీకల్లు ఘటనలో మరో ఇద్దరు మృతిచెందారు. నవాబ్‌పేట్‌ మండలం వట్టిమినేపల్లికి చెందిన కొమురయ్య (90) ఇవాళ ఉదయం తన నివాసంలో మృతి చెందగా, వికారాబాద్‌ మండలంలోని పెండ్లిమడుగుకు చెందిన పెద్దింటి సంతోష (50) మరణించారు. దీంతో కల్తీకల్లు తాగి మృతిచెందినవారి సంఖ్య మూడుకు చేరింది. వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లో కల్తీకల్లు తాగి 300 మందికిపైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత శుక్రవారం జిల్లాలోని చిట్టిగిద్ద కల్లు డిపో నుంచి సరఫరా అయిన కల్లు తాగిన పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు వారిని దవాఖానకు తరలించారు. ఇందులో అత్యధికంగా నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామంలో 25 మంది ఉన్నారు. వికారాబాద్‌ మండలంలోని పెండ్లిమడుగు గ్రామానికి చెందిన బిల్లకంటి కిష్టారెడ్డి (52) ఇప్పటికే మృతి చెందారు.


కాగా, అస్వస్థతకు కారణమైన చిట్టిగిద్ద కల్లు డిపోను అధికారులు ఇప్పటికే సీజ్‌ చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలను మూసివేశారు. కల్తీ కల్లు ఘటనకు గల కారణాలపై ఎక్సైజ్‌ అధికారులతోపాటు, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.