వాట్సాప్ తాజాగా కీలక ప్రకటన

 


వాట్సాప్ ప్రైవసీ పాలసీపై యూజర్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో వాట్సాప్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తమ ప్రైవసీ పాలసీ అప్ డేట్ పై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సాప్ హెడ్ క్యాత్‌ కార్ట్‌ మాట్లాడుతూ.. యూజర్ల ప్రైవసీ, భద్రతకు తాము కట్టుబడి ఉన్నమని స్పష్టం చేశారు. ఈ విషయమై తమ యూజర్లకు వివరిస్తూనే ఉంటామన్నారు. వాట్సాప్ ప్రైవసీ మారుస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ల డౌన్లోడ్లు అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. "గోప్యత విషయానికి వస్తే వినియోగదారుల నమ్మకం కోసం మేము పోటీ పడాల్సి ఉందని మాకు తెలుసు, అది ప్రపంచానికి చాలా మంచిది. ప్రజలు తమ సంభాషణలు మరెవరూ చూడలేరని నమ్మకంగా ఉండాలి" అని క్యాత్‌ కార్ట్ అన్నారు.  తమపై నమ్మకంతో ఉన్న యూజర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రైవసీని కాపాడడంలో పోటీ ఉండడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఖాతాదారుల ప్రైవసీ, భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయమై వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తామెప్పుడు సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ యూజర్ల సంభాషణను చదవలేవు చూడలేవన్నారు. ఇతరులతో వారి కాల్‌లను వినలేవని ఆయన స్పష్టం చేశారు.వాట్సాప్ పేమెంట్స్ కు ప్రత్యేక ప్రైవసీ పాలసీ ఉందన్నారు. వాట్సాప్ కు తీసుకువస్తున్న నూతన ప్రైవసీ విధానం పేమెంట్స్ కు వర్తించదని వివరించారు. అయితే వాట్సాప్ తీసుకురానున్న నూతన ప్రైవసీ పాలసీని ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ నూతన సెక్యూరిటీ విధానం ద్వారా వచ్చే మార్పుల గురించి ఐటీ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.