డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న తారల అరెస్ట్.

 


డ్రగ్స్‌ కేసులో తారల అరెస్ట్‌ పర్వం కొనసాగుతోంది. తాజాగా ముంబైలో నటి శ్వేతా కుమారి డ్రగ్స్‌తో పట్టుబడడం సంచలనం రేపింది. ఎన్సీబీ అధికారులు ఆమెను విచారించారు. ఇంకా ఎవరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న విషయంపై ఆరా తీశారు ఎన్సీబీ అధికారులు. ఇవాళ శ్వేతా కుమారిని కోర్టులో హాజరుపరుస్తారు. టాలీవుడ్ నటిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆమె వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే, ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన నటి ఎవరు అన్న విషయం సోమవారం ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే, ఈ విషయాన్ని ఎన్‌సీబీ అధికార్లు ధ్రువీకరించారు. కన్నడలో 2015లో వచ్చిన ‘రింగ్ మాస్టర్’లో శ్వేతా కుమారి నటించింది. శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కస్టడీ నుంచి సోమవారం ఉదయం తప్పించుకుందని సాయంత్రం మళ్లీ ప్రత్యక్షమైందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఎన్‌సీబీ అధికారులు మాత్రం అలాంటిదేమీ వెల్లడించారు. శ్వేతా కుమారిని హోటల్ రూమ్‌లోనే ఎన్‌సీబీ అధికారులు విచారించినట్టు సమాచారం. ఈరోజు ఉదయం కూడా అక్కడే అధికారులు ఆమెను ప్రశ్నించి సాయంత్రం ఎన్‌సీబీ కార్యాలయానికి రప్పించినట్టు తెలుస్తోంది. కాగా, డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న శ్వేతా కుమారికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సీబీ అప్రమత్తం చేసింది. ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.